హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని వివరించారు. రాబోయే ఎన్నికల్లో తాను కింగ్ మేకర్ కాదని.. కింగ్గానే నిలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో హంగ్ రాదని.. ప్రజలు తమకు సంపూర్ణ మెజార్టీ ఇస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్లోని తెజన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కర్ణాటకలో ప్రజల ఆకాంక్షలను జాతీయ పార్టీలు తీర్చలేకపోయాయని అందుకే అక్కడ ఆ రకమైన ఫలితాలు వచ్చాయని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2012సంవత్సరం కంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు తగ్గినప్పటికీ పన్నుల కారణంగా ప్రజలపై భారం పడుతోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు వేయి ధరఖాస్తులు అన్లైన్ ద్వారా వచ్చాయని… ఈ నెల 27న దరఖాస్తుదారులందరికి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని కోదండరామ్ తెలిపారు.
ఆ పార్టీ నేత విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. దేశంలో అవినీతిలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు. ఆరోగ్య భద్రత, ఆసుపత్రులు, పాఠశాల విద్య తదితర అన్ని వ్యవస్థల్లో అవినీతి ఉందని.. దీనిపై తాము పోరాడుతామన్నారు.




