జనంసాక్షి, మంథని : ఐకెపి వివోఏ ల న్యాయపరమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి వివోఏ లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం మంథనిలోని ఐకెపి కార్యాలయం ఆవరణలో వివోఏ లు చేపట్టిన నిరసన దీక్షకు సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మద్దతు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో ఐకెపి వివోఏలు గత 20 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ మహిళా గ్రూపులను నడుపుతున్నారని ప్రభుత్వం నిర్వహించే వివిధ పథకాలలో వీరు పని చేస్తున్నారని కనీస వేతనముని అమలు చేయాలని 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తూన్న కూడా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమని అన్నారు. వివో ఏలకు కేవలం 3900 వేతనాలు ఇస్తూ వారిని శ్రమదోపిడికి గురి చేస్తుందని అన్నారు. ఈ వేతనాలతో వారి కుటుంబాలను ఎలా పోషించు కుంటారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే వివోఏ ల వేతనాలు పెరుగుతాయని ఆశించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు . వివోఎ ల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించి సెర్ఫు ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేసి ప్రమాద బీమా కల్పించాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఏల్పుల సురేష్,తెలంగాణ ఐకేపి వివోఏ సంఘము జిల్లా అధ్యక్షురాలు రాజశ్రీ, మండల అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి స్వప్న, ఉపాధ్యక్షురాలు మమత, సహాయ కార్యదర్శి తిరుమల తదితరులు పాల్గొన్నారు.




