Wednesday, 4 November 2026

ఒకసారి రక్తదానం చేసి నలుగురి ప్రాణాలకు భరోసా ఇవ్వండి. – అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, మే 5, (జనంసాక్షి )ఒకసారి రక్తదానం చేస్తే నలుగురి ప్రాణాలకు భరోసా కల్పించిన వారు అవుతారని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నెలలో నాలుగు సార్లు రక్తదానం చేయవచ్చన్నారు. జిల్లాలోని తలసేమియా, సికిల్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. తలసేమియా బాధితులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి వస్తుందని, ఒకవేళ అలా చేయని పక్షంలో మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నందున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారు విషయాన్ని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ దృష్టికి తీసుకు రావడంతో స్పందించినా ఆయన రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయించి రక్త నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారని, అందులో భాగంగానే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల ద్వారా 700 యూనిట్ల రక్తం సేకరించి నిల్వ ఉంచామన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీడీఓ వరలక్ష్మి, ఎంపీవో శ్రీనివాస్, ఇంచార్జి మెడికల్ ఆఫీసర్ అలేఖ్య, నాయబ్ తహసీల్దార్ ప్రకాష్, గిర్దావర్ గణేష్, హెల్త్ సూపర్ వైజర్లు యశోద, మెర్సీ, ఫార్మసిస్ట్ కుశ్నపల్లి నారాయణ, రెవెన్యూ సిబ్బంది, ఆరోగ్య కేంద్రం సిబ్బంది, రేషన్ డీలర్లు, యువకులు పాల్గొన్నారు.