జనంసాక్షి, మంథని : మంత్రపురిగా పేరుగాంచిన మంథనిని పర్యాటక కేంద్రంగా అభివృధ్ది చేసేందుకు కృషి చేస్తున్నామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని గోదావరినది తీరాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటుకు అవసరమైన పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు నిండు కుండలా గోదావరినది, మరోవైపు పచ్చని చెట్లతో అటవీ ప్రాంతంతో నిండి ఉన్న మంథని సమీపంలోని గోదావరినది తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో పాటు సందర్శనకు వచ్చే యాత్రికులకు ఆహ్లదం పంచేలా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.అదే విధంగా ఇతర దేశాలు, ప్రాంతాల్లో నివాసం ఉంటున్న మంథనివాసులు ఈ ప్రాంతానికి వస్తే వారికి ఆహ్లదకరమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అదే విధంగా చిన్నారులకు అవసరమైన పార్క్లాంటి సౌకర్యాల కల్పనపై దృష్టిసారించినట్లు ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో మంథనిని ఒక కోనసీమ తరహాలో ఆహ్లదం పంచే పర్యాటక కేంద్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలను పరిశీలించడం జరుగుతోందని, ఇప్పటికే మంథనిలోని రావులచెరువు, తమ్మి చెరువు, బొక్కల వాగు కట్టలపై సుందరీకరణ పనులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. త్వరలో మంథనిని సుందరీకరించడంతో పాటు గోదావరినదితీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.




