– హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌లో పాల్గొనున్న కేటీఆర్, లోకేష్
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆరాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ కుమార్. వీరిరువురు ప్రస్తుతం ఆయా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా వీరు త్వరలో తొలిసారి ఒకే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఫిబ్రవరిలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 15వ వార్షికోవత్సవం దీనికి వేదిక కానుంది. 2018 కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే ఈ యువనేతలు తమ ఆహ్వానాన్ని అంగీకరించారని నిర్వాహక వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఇదే విషయాన్ని కేటీఆర్ అధికారికంగా ధ్రువీకరించగా.. లోకేశ్ మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని చెబుతున్నారు. కేటీఆర్, లోకేశ్ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసిపాల్గొంటున్న తొలి సదస్సు ఇదే కావడంతో విశేషఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్సులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగే అతిపెద్ద ఇండియా కాన్ఫరెన్సుల్లో హార్వర్డ్ కాన్ఫరెన్సు కూడా ఒకటి. దాదాపు వెయ్యిమందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. వాణిజ్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, దాతృత్వవేత్తలు సహా అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొని ప్రసంగిస్తారు. సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్, కేంద్రమంత్రి సురేశ్ ప్రభు, కమల్ హాసన్, సంజయ్ బారూ సహా పలువురు ప్రముఖులు ఈసారి హార్వర్డ్ కాన్ఫరెన్సుకు వెళ్లనున్నట్టు సమాచారం.




