Tuesday, 3 November 2026

ఒక్కో వ్యాపారికి లక్షల్లో నష్టం

నుమాయిష్‌ను నమ్ముకున్న వారికి మిగిలింది బూడిదే

నిర్వహణా లోపాలే కారణమంటున్న వ్యాపారులు

హైదరాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నష్టంపై ప్రాథమిక అంచనాలు వేసినా భారీ స్థాయిలో ఉంటుందని అంటున్నారు. ఇక్కడ వ్యాపారలు చేసి బతుకుదామని వచ్చిన వారు తమ సరుకంతా భస్మీపటలం కావడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఓ బ్యాంకు స్టాల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. తొలుత మంటలు 10 స్టాళ్లకు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే విద్యుత్‌ సరఫరాను నిలిపివేసిన అధికారులు ప్రమాద నివారణ చర్యలను చేపట్టారు. మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ తమ సరుకంతా అగ్నికి ఆహూతైందంటూ వ్యాపారులు బోరున విలపిస్తున్నారు. స్టాళ్లలో బట్టలు సహా అనేక వస్తువులు విక్రయిస్తుంటారు. మంటల వ్యాప్తితో అన్ని కాలిబూడదయ్యాయి. ఒక్క మెటీరియల్‌ తీసుకొనేందుకు వీలు పడలేదు. మొత్తం కాలిపోయింది. ఏటా మేం రూ.30లక్షల సరుకు అమ్ముతాం. ఈ ప్రమాదంతో అదంతా కాలి బూడిదైందని ఓ వ్యాపారి వాపోయాడు. లక్షల విలువ చేసే సరుకు కాలిబూడిదయ్యిందనిబోరున విలపిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఏటా ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేస్తారు. ఎప్పుడూ ఇలా జరగలదేని వాపోయారు. నిత్యం వేలాదిమంది సందర్శకులు.. సెలవురోజుల్లో లక్షకుపైగా వచ్చే కొనుగోలుదారులు.. పిల్లలు, పెద్దలతో నుమాయిష్‌ నిత్యం కిటకిటలాడుతుంది. అడుగు తీసి అడుగుపెట్టలేనంత రద్దీ ఉంటుంది. ఇలాంటి చోట సందర్శకుల భద్రతకు నిర్వాహకులు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు ఉండాలి. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంతో భద్రతా లోపాలు వెలుగుచూశాయి. అత్యధిక స్టాల్స్‌ బుగ్గిపాలు కాగా సందర్శకులకు ప్రాణపాయం తప్పింది. ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్‌ ప్రదర్శనను 79 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉండటంతో ఎగ్జిబిషన్‌ నిర్వాహణలో ఎప్పుడూ అవాంతరాలు ఏర్పడలేదు. లోపాలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఏటా నిర్వహిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకపోయినా అనుమతులు యథేచ్ఛగా జారీ చేస్తున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఎగ్జిబిషన్‌ మైదానంలో దాదాపు 2500 స్టాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ తాత్కాలిక షెడ్లలో పెడుతున్నారు. వస్త్రాలతోనే ఎక్కువ స్టాల్స్‌ను రూపొందించారు. వీటిలో అత్యధికం వస్త్ర సంబంధిత, పాదరక్షలు, లెదర్‌బ్యాగులు, ప్లాస్టిక్‌ వస్తువుల విక్రయ కేంద్రాలే ఉన్నాయి. ఇవన్నీ ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయి. దుకాణాలకు, లైటింగ్‌ కోసం విద్యుత్తు తీగలను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ అగ్గి రాజుకున్నా.. మంటలు దావానంలా వ్యాపించే ప్రమాదం ఉందని బుధవారం రాత్రి జరిగిన ప్రమాదం నిరూపించింది. ప్రదర్శన నిర్వహణలో లోపాల కారణంగా అగ్నిప్రమాదం ఇప్పుడు పేద వ్యాపారులను రోడ్డున పడేసింది.