న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : ఇక నుంచి సిగరేట్ కావాలంటే పెట్టె కొనాల్సిందే. ఒక్కటి మాత్రమే కావాలనుకుంటే అది కుదరనే కుదరదు. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కఠిన విధానం అవలంభించనుంది. ప్యాకెట్‌లో కాకుండా విడిగా సిగరెట్ల విక్రయాలపై నిషేధం విధించనుంది. పార్లమెంట్ ఆమోదం తర్వాత ఇది అమల్లోకి రానుంది. ఈ విధానం అమల్లోకి వస్తే విడివిడిగా సిగరెట్లు విక్రయించడానికి అవకాశముండదు. మొత్తం ప్యాకెట్‌ను విక్రయించాల్సి ఉంటుంది. ఈ మేరకు విడివిడిగా సిగరెట్ల విక్రయాలపై నిషేధం విధించాలని సిఫార్సు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేసే వారి నిర్దేశిత వయస్సును పెంచాలని సిఫార్సు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై ఏర్పాటుచేసిన కమిటీ చేసిన సిఫార్సులను
ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిందని ఆయన సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. సిగరెట్ సహా పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు కమిటీ చేసిన సూచనలను అమలు చేస్తామన్నారు. ‘విడిగా సిగరెట్ల అమ్మకంపై నిషేధం, పొగాకు ఉత్పత్తులు కొనుగోలు చేసే వారి వయస్సును పెంచడం, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు విధించాలన్న కమిటీ సిఫార్సులను ఆమోదించామని’ మంత్రి వెల్లడించారు. కమిటీ సిఫార్సులను డ్రాఫ్ట్ నోట్ రూపంలో మంత్రివర్గ సహచరులకు అందజేసినట్లు వివరించారు.





