Monday, 2 November 2026

మన్మోహన్‌ను ఎందుకు మినహాయించారు ?

8

బొగ్గు మంత్రిని ప్రశ్నించారా?

కేసు డైరీ సమర్పించండి

సీబీఐ ప్రత్యేక కోర్టు

న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో దర్యాప్తులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎందుకు మినహాయించారని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. బొగ్గు మంత్రిని ప్రశ్నించారా? .. కేసు డైరీని సమర్పించండి అని కోర్టు నిలదీసింది. కోల్‌గేట్‌ స్కాంపై సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం విచారణ నిర్వహించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త కేఎం బిర్లాకు 2005లో కేటాయించిన బొగ్గు గనుల కేటాయింపుపై నాటి బొగ్గు శాఖ మంత్రిని ఎందుకు విచారించలేదని న్యాయమూర్తి భరత్‌ పరాశరన్‌ సీబీఐని ప్రశ్నించారు. 2005లో బొగ్గు మంత్రిత్వ శాఖను నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పర్యవేక్షించారు. అయితే, అప్పటి బొగ్గు మంత్రి అని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి.. ఎక్కడా మన్మోహన్‌ పేరును ప్రస్తావించలేదు. ‘ఈ వ్యవహారం (కుంభకోణం)లో నాటి బొగ్గు మంత్రిని ప్రశ్నించాలని విూరు ఆలోచించలేదా? ఆయనను విచారించాలని విూరు భావించలేదా? లేక ఆ మంత్రిని విచారించేందుకు అనుమతి లేదా? పూర్తి స్పష్టత కోసం ఆయన వాంగ్మూలం అవసరమని విూరు ఆలోచించలేదా?’ అని సీబీఐని ప్రశ్నించారు. దీనికి విచారణ అధికారి బదులిస్తూ.. ప్రధాని కార్యాలయం అధికారులను విచారించామని కోర్టుకు తెలిపారు. అందుకే బొగ్గు శాఖ మంత్రి ప్రకటన అవసరం లేదని భావించామని చెప్పారు. నాటి మంత్రిని విచారించేందుకు తమకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంఓ అధికారులను విచారించాం.. ఇందులో బొగ్గు మంత్రి పాత్ర లేదని పీఎంఓ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణం కేసు డైరీని సమర్పించాలని వాదనల సందర్భంగా సీనియర్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టును కోరారు. దీంతో బొగ్గు కుంభకోణం కేసు డైరీని సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. సీల్డ్‌ కవర్‌లో కేసు డైరీని సమర్పించేందుకు అనుమతి ఇచ్చేందుకు అనుమతించాలని కోరగా, అంగీకరించింది. తదుపరి విచారణను నవంబర్‌ 27కు వాయిదా వేసింది. కుంభకోణంలో ప్రైవేట్‌ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులకు సంబంధించి తగిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సీబీఐ గత విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *