ప్రచారంలో టిఆర్‌ఎస్ అభ్యర్థుల నినాదం
జోరుగా ఇంటింటి ప్రచారంలో గులాబీదళం
జనగామ,అక్టోబర్31(జనంసాక్షి): జనగామ జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుని పోతున్నారు. గ్రామాలను చుట్టేస్తున్నారు. రోజుకో ఊరు..అన్న చందంగా ప్రచారం చేస్తున్నారు. మందీమార్బలంతో కలసి అట్టహాసంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మధ్యలో చేరికలతో జోష్ నింపుతున్నారు. బుధవారం వివిధ గ్రామాల్లో ముగ్గురు నేతలు రాజయ్య,ముత్తిరెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రచారంలో పాల్గొన్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచిన సింహం లాంటి కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకోవాలని, స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తాటికొండ రాజయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. కారు.. కేసీఆర్ అనే నినాదంతో తాము ఎన్నికల బరిలోకి దిగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జత కట్టడంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందనే ఇంగిత జ్ఞానం ఆ పార్టీకి లేకపోవడం శోచనీయమన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని మాజీ ఎమ్మెల్యే అన్నారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. టీఆర్‌ఎస్ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డియాదగిరిరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడితే చీకట్లు కమ్ముకుంటాయని అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలను పటాపంచలు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా 24గంటల పాటు నిరంతరంగా విద్యుత్ అందజేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. సీమాంధ్రుల కుట్రలు, కుతంత్రాలు ఛేధించి తెలంగాణను అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న నేత కేసీఆర్ అన్నారు. ఈ అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలించాలని కోరారు. మహాకుటమి పేరుతో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేసిన, చేస్తున్న పార్టీలు ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వస్తున్నాయని వాటిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అలాగే 30 సంవత్సరాల ఇక్కడి ప్రజల ఆ కాంక్ష మేరకు జిల్లాలు, ముండలాల పునర్విజన చేశారన్నారు. ఈ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా ఆశీర్వదించి మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని రైతన్నల మోముల్లో చిరునవ్వులు చిందేలా పరిపాలన అందించా లన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పాలకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.ఎర్రబెల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులకు ఆశించిన స్థాయిలో సాగు జలాలు లేక ఎన్నో ఏండ్లుగా ఇబ్బందులు పడ్డారన్నారు. పట్టణాలకు వలసలు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్థానిక రైతాంగాన్ని ఏనాడు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలో భూగర్భ జలాలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నట్లు చెబుతున్నారని, అన్ని మండలాలకు ఎస్సారెస్పీ, దేవాదుల జలాలను తీసుకొచ్చినట్లు వివరించారు.





