Thursday, 5 November 2026

కంటి వెలుగును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:

ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ జనవరి 17( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమం
జనవరి 19వ తారీకు నుండి జూన్ 19 వరకు నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వైద్య సిబ్బంది జనవరి 19న తేదీన పద్మశాలి ఫంక్షన్ హాల్ నందు కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ మున్సిపల్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్ ల సహకారంతో కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా మూడు కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటిరోజు అమరవరం గ్రామపంచాయతీ పరిధిలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వార్డ్ లోని పద్మశాలి ఫంక్షన్ హాల్, 15 వ వార్డులో క్యాంపు నిర్వహణకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో వై. హైమావతి సిస్టర్, జి.వినోద, సీత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.