Thursday, 5 November 2026

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఆర్డీవో వెంకారెడ్డి

హుజూర్ నగర్ జనవరి 16 (జనంసాక్షి): ఈనెల 18వ తారీఖు నుండి జూన్ 19 వరకు నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో వెంకారెడ్డి కోరారు. సోమవారం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నిర్వహించిన కంటి వెలుగు మాక్ డ్రిల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కార్యక్రమ ప్రారంభానికి ముందు వైద్య ఆరోగ్యశాఖ మున్సిపల్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచ్ ల సహకారంతో కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల వ్యాప్తంగా మూడు కంటి వెలుగు క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటిరోజు అమరవరం గ్రామపంచాయతీ పరిధిలో, హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డ్ లోని పద్మశాలి ఫంక్షన్ హాల్ నందు, 15వ వార్డులోని ముత్యాలమ్మ గుడి వద్ద క్యాంపు నిర్వహణకు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గజగంటి ప్రభాకర్, ఆర్డీవో ఆఫీస్ సూపరిండెంట్ అప్పారావు, ఉదయగిరి శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.