* వైరా ఎమ్మెల్యే లావిడియా రాములు నాయక్
జూలూరుపాడు, జనవరి 19, జనంసాక్షి: రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధ పడకూడదనే దృఢ నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావిడియా రాములు నాయక్ అన్నారు. మండల పరిధిలోని అనంతారం గ్రామపంచాయతీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని, శరీరంలోని అన్ని అవయవాల కన్నా కళ్లు అత్యంత ప్రధానమైనవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిబిరాలను ఏర్పాటు చేసి, ఆయా తేదీల్లో కంటి పరీక్షలు నిర్వహించటం జరుగుతుందని, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కంటి వ్యాధులతో బాధపడే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యదళ్ళపల్లి కళాశ్రీ, ఎంపీపీ లావిడియా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎదళ్ళపల్లి వీరభద్రం, ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, తాసిల్దార్ లూధర్ విల్సన్, వైద్యాధికారి రాకేష్, ఎంపీఓ రామారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పొన్నెకంటి సతీష్, మాజీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, జిల్లా నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, దుద్దుకూరు కృష్ణ ప్రసాద్ పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




