Thursday, 5 November 2026

రెండవ విడత కంటి వెలుగు ప్రారంభం

పాల్గొన్న కలెక్టర్ జితేష్, ప్యానల్ స్పీకర్ షిండే
బిచ్కుంద జనవరి 19 (జనంసాక్షి) తెలంగాణ రాష్టంలో ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం నాడు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పుల్కల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు తెలంగాణ రాష్ట అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు భీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కంటి వెలుగు తదితర పథకాలను ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని దేశ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ కోరారు. వీరితో పాటు నాల్చర్ రాజు, సర్పంచ్ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ రాజు పటేల్ మరియు అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.