– జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
ఇటిక్యాల (జనంసాక్షి) జనవరి 20 కంటి వెలుగు పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం, వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమం కింద ఎంత మందికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు చేసి అద్దాలను పంపిణీ చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆశ వర్కర్లు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమం పై అవగాహన కల్పించి శిబిరానికి తీసుకురావాలన్నారు. ప్రజల యొక్క పూర్తి డేటా నమోదుచేసి వారికి అవసరమైన మందులు పంపిణీ చేయాలన్నారు. కంటి వెలుగు శిబిరం దగ్గర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి సేవలు అందించాలని సూచించారు. అలాగే గ్రామ అభివృద్ధికి, అవెన్యూ ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలని ఎంపిడిఓ రాఘవ ను ఆదేశించారు. అనంతరం కొండేరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమములో భాగంగా పాఠశాల భవనాల మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫ్లోరింగ్, టాయిలెట్స్, కిచెన్ షెడ్ కలరింగ్ వాటినన్నింటినీ పరిశీలించి కలరింగ్, టైల్స్ పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే మూడు అంగన్వాడి సెంటర్ లను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం విద్యార్థుల హాజరు పట్టిక, మధ్యాహ్న భోజనం, విద్యార్థుల వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యదికారి డాక్టర్ శశికళ, ఇటిక్యాల సర్పంచ్ సరోజమ్మ, కొండేరు సర్పంచు వీరన్న, వల్లూరు సర్పంచ్ ఏసన్న, ఎంపిటిసి వెంకటేశ్వరమ్మ, తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, విద్యాధికారి రాజు, పంచాయతిరాజ్ ఏఈ పాండురంగారావు, స్పెషల్ ఆఫీసర్ మారుతి నందన్, వైద్యులు నందిని, మహేష్ పాల్గొన్నారు.




