Wednesday, 4 November 2026

కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదు

పోరాటాలతోనే సాధ్యం
రాజకీయ లబ్ధికోసమే వలసలు
శ్రీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మహ్మద్‌ హుస్సేన్‌
జమ్మికుంట, జూన్‌ 10 (జనంసాక్షి) :
కండువాలు, టోపీలు మార్చితే తెలంగాణ రాదని, ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని కేంద్ర కమిటీ సభ్యుడు హుస్సేన్‌, అలియాస్‌ సుధాకర్‌ అలియాస్‌ శంకర్‌, అలియాస్‌ రమాకాంత్‌ అన్నారు. నాలుగున్నరేళ్ల జైలు జీవితం గడిపిన మహ్మద్‌ హుస్సేన్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. సోమవారం పోలీసులు ఆయనను అరెస్టు చేసి జిల్లా ఎస్పీ వద్దకు తీసుకెళ్లారు. విచారణ అనంతరం ఆయనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో పర్మినెంట్‌ మజ్దూర్‌గా పనిచేశానని, అప్పట్లో విప్లవోద్యమానికి ఆకర్షితుడనై నక్సల్స్‌ సంస్థలో చేరానన్నారు. సింగరేణి కార్మిక సమాఖ్యలో బాధ్యతలు చేపట్టి కార్మికుల సంక్షేమం పోరాటం చేశామన్నారు. తనపై రాష్ట్రంలో 28 కేసులు నమోదు కాగా.. అవన్నీ కొట్టివేశారన్నారు. 2009లో జార్ఖండ్‌లోని బోకారోలో అరెస్టు అయి అదే ఏడాది మే 29న వరంగల్‌ జైలుకు వెళ్లానని, తిరిగి 2011ఏప్రిల్‌ 8న రాంచి జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. 1992 నుంచి తన భార్య జీలానీబీ కూడా పార్టీలో పని చేసిందన్నారు. 2006లో తన భార్య జీలానీబీని బోగస్‌ ఎన్‌కౌంటర్‌లో చంపారని, వారం రోజుల తర్వాత తనకు ఆ విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్‌, టీడీపీలకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అర్థమవుతోందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి  తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.  బెయిల్‌పై విడుదలై వచ్చిన తనను పోలీసులు విచారణ నిమిత్తం మొదట జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు, తర్వాత జిల్లా ఎస్పీ వద్దకు తీసుకెళ్లి వదిలిపెట్టారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *