Thursday, 5 November 2026

కటకం సుదర్శన్ త్యాగం వెలకట్టలేనిది.

;- ఆయన బాటలో నడవడమే నిజమైన నివాళి.
;-విప్లవోద్యమానికి సుదర్శన్ ఇరుసు లాంటివాడు.
;- ఓపిడిఆర్ రాష్ట్ర నేత అంబాల మహేందర్.
బెల్లంపల్లి, జూన్ 10, (జనంసాక్షి )భారతదేశం యొక్క విప్లవ ఉద్యమానికి కటకం సుదర్శన్ అందించిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (ఓపిడిఆర్ )రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అంబాల మహేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీలో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని సింగరేణి కార్మిక కుటుంబంలో జన్మించిన ఆనంద్ దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించాడన్నారు. తన యొక్క జీవితాన్ని చివరి శ్వాస వరకు పేద బడుగు బలహీన వర్గాలకే అంకితం చేశాడన్నారు. పేద ప్రజల కోసం తాను ఎదుర్కొన్న నిర్బంధాలు అన్ని ఇన్ని కావని ఆయన గుర్తు చేశారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తాను ఎంచుకున్న మార్గాన్ని విడనాడే ఆలోచన ఏనాడు చేయలేదన్నారు. మార్క్స్, లెనిన్, మావో ఆలోచన విధానాలను ఆచరణలో ఆచరించి చూపెట్టిన నిజమైన కమ్యూనిస్టు గా ఆనంద్ పేరు కమ్యూనిస్టు విప్లవ ఉద్యమ చరిత్రలో లిఖించబడుతుందన్నారు. అంతకుముందు ఆయన వెంట నివాళులర్పించిన వారిలో కటకం సుదర్శన్ సోదరుడు కటకం సతీష్, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్నమ్ శంకర్, మహిళా నాయకురాల్లు సునీత, సంగీత తో పాటు తదితరులు పాల్గొన్నారు