కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్… 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు.మరోవైపు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్‌కుమార్. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి.