Thursday, 5 November 2026

కన్న తండ్రి రుణం తీర్చుకుంది”

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
జూలూరుపాడు, జనవరి 21, జనంసాక్షి: అనారోగ్యంతో కన్నుమూసిన కన్నతండ్రికి తల కొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించి కూతురు తన తండ్రి రుణం తీర్చుకున్న సంఘటన ఇది. మండల పరిధిలోని గుండెపుడి గ్రామానికి చెందిన సిరోజు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. ఆయనకు భార్య సరోజిని కూతుళ్లు రమాదేవి, రూప, బేబీ, విజయ నలుగురు సంతానం. గత 30 ఏళ్లకు పైగా ఆయన గుండెపుడి గ్రామపంచాయతీ గుమస్తాగా పనిచేస్తున్నాడు. గుండెపుడితో పాటు వెంగన్నపాలెం, జూలూరుపాడు, రామచంద్రాపురం పలు గ్రామాల పరిధిలో గుమస్తా వెంకటేశ్వర్లు అని ఆయనను జనం పిలుస్తుంటారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రజలతో కలిసిమెలిసి ఆయన జీవనం సాగించాడు. ఆయనకు భార్య నలుగురు ఆడపిల్లలు సంతానం. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం జరిపించాడు. ఈయనది నిరుపేద కుటుంబం. ఆర్థిక స్తోమత లేకపోయినా ఆడపిల్లలకు పట్టుదలతో విద్యాబుద్ధులు నేర్పించాడు. ఇటీవల వెంకటేశ్వర్లు అనారోగ్యం చెందడంతో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం పొందుతూనే శనివారం ఆయన కన్నుమూశారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో భార్య, పిల్లలు బోరున విలపించారు. కన్నతండ్రి భౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు మగపిల్లలు లేకపోవడంతో పెద్ద కూతురు రమాదేవి పుట్టెడు దుఃఖంతో తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించి కన్న తండ్రి రుణం తీర్చుకుంది. వెంకటేశ్వర్లు భౌతికకాయాన్ని పలువురు ప్రముఖులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, తిలకించి నివాళులర్పించారు. కూతురు కన్న తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండటంతో గ్రామ పెద్దలు సైతం ఆమెకు తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చారు.