బిచ్కుంద జూన్ 05 (జనంసాక్షి) కరెంట్ కోసం ధర్నాలు, సబ్ స్టేషన్ల ముట్టడి రోజులు పోయాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నాలుగో రోజుకి చేరుకున్నాయి. తొలిరోజు ఆవిర్భావ దినోత్సవం, రెండో రోజు రైతు దినోత్సవం, మూడో రోజు సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నాలుగో రోజు మండల కేంద్రంలో గల బండయ్యప్ప ఫంక్షన్ హాలులో విద్యుత్ విజయోత్సవం జరుపుకున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు రంగంలో అద్భుత రీతిలో పురోగతి సాధించి, దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కరెంట్ కోతలు, పవర్ హాలీడేలు, కరెంట్ కోసం ధర్నాలు, సబ్ స్టేషన్ల ముట్టడి, రాస్తారోకోలు ప్రత్యేక తెలంగాణ రాకముందు జరిగేవని, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతున్నదని పేర్కొన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఆయనతో పాటు అశోక్ పటేల్, నాల్చర్ రాజు, మాధవరావు దేశయ్, అన్నారాం వెంకట్రామ్ రెడ్డి, పండిత్ రావ్ పటేల్, నాగ్నాథ్ పటేల్, బస్వరాజ్ పటేల్, విద్యుత్ శాఖ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కోసం ధర్నాలు, సబ్ స్టేషన్ల ముట్టడి రోజులు పోయాయి ఎమ్మెల్యే షిండే




