Thursday, 5 November 2026

కాంగ్రెస్‌ పార్టీ ఒక్క ఉద్యమకారుడికైనా టికెట్‌ ఇచ్చిందా..?

– ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది
– గాంధీభవన్‌ వద్ద సీట్లకోసం కోదండరాం పొర్లుదండాలు పెడుతుండు
– కూటమి లక్ష్యం ఏంటో కోదండరాం ప్రజలకు చెప్పాలి
– 2014లో పరోక్షంగా కోదండరాం కాంగ్రెస్‌కు సహకరించారు
– ఇప్పుడు ప్రత్యక్షంగా సహకరిస్తున్నాడు
– ఎన్ని కూటములు వచ్చినా కేసీఆర్‌ ప్రభంజనాన్ని అడ్డుకోలేవు
– 100 స్థానాల్లో తెరాస విజయం ఖాయమైంది
– ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు
హైదరాబాద్‌, నవంబర్‌12(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యమకారుడికైనా టికెట్‌ ఇచ్చిందా అని ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు సమక్షంలో ప్రయివేటు ఉద్యోగుల సంఘం నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఉద్యమకారులను చట్టసభలకు పంపిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ది అన్నారు. కూటమి లక్ష్యం ఏంటో కోదండరాం ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ గా కోదండరాంను పెట్టాలని అమరావతి నుంచి ఉత్తమ్‌ కు ఆదేశాలు చంద్రబాబు నుంచి వచ్చాయన్నారు. 2014లో పరోక్షంగా  కాంగ్రెస్‌ కు సహకరించిన కోదండరాం.. ఇప్పుడు ప్రత్యక్షంగా కాంగ్రెస్‌ కు సహకరిస్తున్నారని హరీష్‌రావు అన్నారు.
తెలంగాణ సాధించేంత వరకు కోదండరాంను కంటికి రెప్పలా కాపాడుకున్నామని తెలిపారు. కోదండరాంపై కాంగ్రెస్‌ ఎంత కుట్ర చేసిందో, చంద్రబాబు ఎంత అవమానపరిచాడో ఆయన మరిచిపోయిన ప్రజలు మరిచిపోరు. వలస పార్టీలకు వ్యతిరేకంగా పోరాడిన కోదండరాం ఇవాళ అదే వలస పార్టీలకు వంత పాడుతున్నాడని విమర్శించారు. తెర వెనుక నడిపించేది అంతా చంద్రబాబు అయినా కోదండరాంను మభ్య పెట్టేందుకు సమన్వయ కమిటీ చైర్మన్‌ అంటూ ముందుకు తెచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోయే సీట్లను టీజేఎస్‌కు అంటకడుతోందన్నారు. కోదండరాం నిజస్వరూపాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిపించుకుంటామని హరీష్‌రావు తెలిపారు. ఆనాడు జేఏసీని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్‌ కుట్రలు చేసిందని, కాంగ్రెస్‌ నాయకులు నాడు చెరుకు సుధాకర్‌పై పీడీయాక్ట్‌ పెట్టి వరంగల్‌ సెంట్రల్‌
జైలుకు పంపించారన్నారు. కూటమి ఏ ఉద్దేశంతో ఏర్పాటైందో స్పష్టత ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. ఉద్యమ సమయంలో ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ అండగా నిలిచిందని, ఆనాడు ఉస్మానియా విద్యార్థులపై కేసులు పెట్టింది కాంగ్రెస్‌ అయితే.. బెయిల్‌ ఇప్పించింది టీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు. విద్యార్థి నేతలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని అన్నారు. ప్రొఫెసర్‌ సీతారాం నాయక్‌ను, డాక్టరైన బూర నర్సయ్యగౌడ్‌ను ఎంపీలుగా గెలిపించుకున్నామని తెలిపారు. ఉస్మానియా విద్యార్థులు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో టికెట్ల ధర్నా చేస్తున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు. కోదండరాం, కాంగ్రెస్‌, టీడీపీ కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హరీష్‌రావు హెచ్చరించారు.