Wednesday, 4 November 2026

కాంగ్రెస్‌ రెబెల్స్‌ తిరుగు బావుటా

 

టిక్కెట్ల కేటాయింపులపై ఆగ్రహ జ్వాలలు

హైకమాండ్‌ జాన్తా నై అంటూ వీరంగం

బరిలో నిలుస్తామన్న పలువురు నేతలు

సర్వేపై అల్లుడు క్రిషాంక్‌ తిరుగుబాటు

హైదరాబాద్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ రెబెల్స్‌ తిరుగుబాటు గంట మోగించారు. రెబెల్స్‌గా బరిలోకి దిగుతామని హెచ్చరించారు. తమకు టిక్కెట్‌ ఇవ్వనందుకు తడాఖా చూపిస్తామని అన్నారు. పది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల ఆశావహులు ఢిల్లీ,హైదరాబాఇద్‌ల్లో తిరుగుతూ చివరకు ప్రకటించిన జిబితాలో తమ పేర్లు లేవని తెలయడంతో తిరుబాటు చేపట్టారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ టిక్కెట్లు ఎప్పుడు ప్రకటిస్తారో, ఆ జాబితాలో తమ పేరు ఉంటుందో లేదో అనే సంశయం మధ్య కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల చేసింది. నామినేషన్ల ప్రారంభం రోజునే 65 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన ఆ పార్టీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. నామినేషన్ల పక్రియ ప్రారంభమైన వేళ తొలి జాబితాలో అవకాశం దక్కని ఆశావహులు, వారి అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొందరు పార్టీ మారుతున్నట్టు ప్రకటిస్తుంటే.. మరికొందరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతామంటున్నారు. ఇంకొందరైతే తమ నిరసనల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో కొంత గందరగోళం నెలకొంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు కొందరు సర్వే సత్యనారాయణకు టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ గాంధీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. కంటోన్మెంట్‌ టికెట్‌ను సర్వే సత్యనారాయణకు కేటాయించడంపై నిరసన వ్యక్తంచేశారు. ఆ టికెట్‌ను క్రిషాంక్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆయన వర్గీయులు ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివిధ జిల్లాల్‌ఓ ఇదే పరిస్థితి ఉంది. హైదరాబాద్‌ శేరిలింగంపల్లి నియోజకవర్గం విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం పునరాలోచించుకోవాలని మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కోరారు. ఆ స్థానం తనకు కేటాయించకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. శేరిలింగంపల్లి నియోజవర్గ సీటును మహాకూటమి పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించారని… తాను ఇప్పటికే అధిష్ఠానం సూచన మేరకు నెల రోజులుగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నానని చెప్పారు. పొత్తులో భాగంగా తెదేపాకు కేటాయించారు. భవ్య ఆనంద్‌ప్రసాద్‌ పేరును తెదేపా ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఆశావహ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి పంపారు. పార్టీలో ప్యారాచూట్‌ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వడంపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన స్పష్టంచేశారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు కూడా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. తుంగతుర్తి సీటును మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాలమహానాడు, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మహబూబా బాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు ప్లకార్డులను పట్టుకొని నిరసన చేపట్టారు. అద్దంకి దయాకర్‌కు టిక్కెట్‌ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆయనకు టికెట్‌ ఇవ్వని పక్షంలో కాంగ్రెస్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. వేములవాడ స్థానాన్ని ఏనుగు మనోహర్‌కు కేటాయించకుండా.. ఆది శ్రీనివాస్‌కు కేటాయించడంతో మనోహర్‌ వర్గీయులు నిరసనకు దిగారు. ఇద్దరు

వ్యక్తులు కాంగ్రెస్‌ జెండా పట్టుకొని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కారు. గత కొంత కాలంగా వేములవాడ టికెట్‌ను ఆది శ్రీనివాస్‌, ఏనుగు మనోహర్‌ రెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఎవరికి వారే టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ, అధిష్ఠానం చివరకు శ్రీనివాస్‌ వైపే మొగ్గు చూపడంతో మనోహర్‌ రెడ్డి వర్గీయులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో వేములవాడ పట్టణంలోని సుభాష్‌ నగర్‌ ఏరియాలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి తమ నిరసన వ్యక్తంచేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి రెబల్‌గా బరిలో దిగనున్నట్టు జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పోశాల పద్మ ప్రకటించారు. అయితే, ఈస్థానాన్ని కాంగ్రెస్‌ ఇంకా ఎవరికీ కేటాయించలేదు. తొలి నుంచి తెలంగాణ జనసమితి ఈ స్థానానికి పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇకపోతే జనగామ నుంచి టిక్కెట్‌ రాకపోవడంతో పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ విమానం ఎక్కారు. మొత్తంగా జిల్లాల్లో అసంతృప్తులు గట్టిగానే ఉన్నారు. వారంతా తమకు టిక్కెట్లు రాలేదనో,అనుచరులకు ఇవ్వలేదనో నిరసనలు తెలుపుతున్నారు. సమతూకం లేదని అంటున్నారు. బిసిలకు అన్యాయం జరిగిందంటూ కృష్ణయ్య బంద్‌కు పిలుపునిచ్చారు.