రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 13. (జనంసాక్షి). రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చత్తిస్ గడ్ లో ఏం చేసిందో చూపిస్తా రమ్మంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కరీంనగర్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ కు సవాల్ విసిరారు. శనివారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయిన్ పల్లి వినోద్ కుమార్ రైతుల విషయంలో దేశంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆదర్శంగా ఉందంటూ మాట్లాడడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చత్తీస్ గడ్ లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్వింటాలకు 500 రూపాయలు అదనంగా ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన విత్తనాలు ఎరువులు క్రెడిట్ పై ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంపై దమ్ముంటే వినోద్ కుమార్ చత్తీస్ గడ్ కు వస్తే ప్రత్యక్షంగా చూపిస్తామని వినోద్ కుమార్ కోసం రైల్వే టికెట్లు కూడా బుక్ చేశామంటూ టికెట్లను చూపించారు. రైలు రావడం ఇబ్బంది అనుకుంటే విమానం టికెట్లు కూడా బుక్ చేస్తామని అన్నారు. కరీంనగర్ ఎంపీగా పనిచేసిన కాలంలో జిల్లాకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. మెగా పవర్ లూమ్ టెక్స్ టైల్ పార్క్ తన సొంత జిల్లా అయిన వరంగల్ కు తరలించి సిరిసిల్ల నేతన్నలకు మొండి చేయి చూపించారాని అన్నారు. కుసంస్కారంతో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. సమావేశంలో డిసిసి జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు, కుస రవీందర్, టోనీ, మునిగేల రాజు తదితరులు పాల్గొన్నారు.




