రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 13. (జనంసాక్షి). చర్చల ద్వారా సానుకూల వాతావరణంలో సమస్యను పరిష్కరించాల్సింది పోయి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కరీంనగర్ మాజీ ఎంపీ,పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. శనివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె న్యాయమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు దిగడం వల్ల జూనియర్ కార్యదర్శి ప్రాణాలు బలి తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోతే సాధించేది ఏమీ లేదని పోరాడి సాధించుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులకు అండగా ఉంటుందని అన్నారు. సంబంధిత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంచాయతీ కార్యదర్శుల పట్ల వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. తక్షణమే పంచాయతీ కార్యదర్శుల సమస్యను పరిష్కరించి విధుల్లో చేరేలా చూడాలని బెదిరింపులకు దిగడం మానుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వ స్పందించిని పక్షంలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఆని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. స్థానిక ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామున్ని హనుమంతున్ని రాజకీయాల్లోకి దించి విద్వేష రాజకీయాలు నడుపుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ ధల్, ఏక్తా యాత్రలకు కాలం చెల్లిందని కర్ణాటక ఫలితాలు మత తత్వ రాజకీయాలను తిప్పికొట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పంచాయతీ కార్యదర్శుల సమ్మె విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా జిల్లా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు. సమావేశంలో డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, నాగుల సత్యనారాయణ గౌడ్, కుస రవీందర్, కాముని వనిత, ఆకునూరు బాలరాజు, సూర దేవరాజు, టోని, మునిగల రాజు తదితరులు పాల్గొన్నారు.




