Wednesday, 4 November 2026

కాంగ్రెస్ వల్లే తెలంగాణ.. మా నేతల చేతులకి సంకెళ్లా : గుత్తా సుఖేందర్ రెడ్డి

gutta
 హైద‌రాబాద్ జ‌నంసాక్షి

 కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని, కానీ అధికారంలోకి వచ్చిన తెరాస.. తమ పార్టీ నేతలకే సంకెళ్లు వేయిస్తున్నారని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ అనాలోచిత నిర్ణయాలతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్ని వర్గాల ప్రజలను వంచిస్తున్నారని మండిపడ్డారు. 

ఆచరణకు సాధ్యంకాని హామీలు, కార్యక్రమాలు తీసుకోని ముఖ్యమంత్రి ప్రజలను భ్రమపెడుతున్నారన్నారు. రాత్రి కల వస్తే అదే చేస్తాం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, కల వేరు ఆచరించడం వేరన్నారు. కేసీఆర్ తన 8 నెలల పాలనలో ఏ ఒక్క ప్రజాసమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఎస్సీలకు 3 ఎకరాల భూపంపిణి పథకం కింద నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నామమాత్రం ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. 
ప్రభుత్వానికి ఏ సమస్యపై కూడా సరైన అవగాహన లేకుండా పోయిందన్నారు. సచివాలయం, చెస్ట్ ఆసుపత్రి తరలింపునకు వ్యతిరేకంగా గాంధీ భవన్ నుంచి రాజ్‌భవన్‌వరకు శాంతియుతంగా టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడితే పోలీసులతో ప్రభుత్వం అరెస్ట్ చేయించి మా నేతల చేతులకు బేడీలు వేయించిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పాదయాత్ర చేస్తే ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *