– శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
– తెల్లవారు జామునుండే ఆలయాల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు
హైదరాబాద్, నవంబర్19(జనంసాక్షి) : శ్రీమహావిష్ణువుతో సమానమైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీకమాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రతీకరమైంది కార్తీకమాసం. ఇది, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీకమాసం రెండో సోమవారంతోపాటు ఏకాదశి కావడంతో తెలుగు రాష్ట్రా/-లలో శైవ, వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సామర్లకోట, పిఠాపురం తదితర ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వ్రత మండపాలు కిటకిటలాడాయి. ఒంగోలులో రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంతోపాటు శివాలయాలన్నీ ముకంటి నామస్మరణతో మారుమోగాయి. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఎరగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లెలచెరువు, డోర్నాలలోని శివాలయాల్లో కార్తీక దీపారాధన చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం రెండో సోమవారం, ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా తరలివచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపారాధన చేశారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, ఉమామహేశ్వర వ్రతాలు నిర్వహించారు. ఉచిత దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీరాజరాజశ్వేరస్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు. వరంగల్లోని వేయిస్తంభాల గుడిలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సూర్యోదయానికి ముందే నదులు, చెరువుల్లో పుణ్య స్నానాలు ఆచరించి భక్తులు కార్తీక దీపాలు వదిలారు. ఇక, కార్తీక శుద్ధ ఏకాదశిని ‘ప్రబోధైకాదశి’,’బృందావన ఏకాదశి’ అనే పేరుతో పిలుస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్యవ్రతం కూడా ఈ ఏకాదశితోనే ముగుస్తుంది. కురుక్షేత్రంలో భీష్ముడు ఈ ఏకాదశినాడే అస్త్ర సన్యాసం చేసి, అంపశయ్య విూద శయనించాడు. యజ్ఞవల్క్య మహర్షి ఈరోజునే జన్మించారు. అందుకే దీనికి అంతటి విశిష్టత ఉంది.




