వైద్య సేవలను వ్యాపారంలా చూడకూడదు: హరీష్ రావు
హైదరాబాద్,సెప్టెంబర్3(జనం సాక్షి): కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలకు అందే వైద్య సేవలు ఎన్నడూ వ్యాపారంలా చూడకూడదన్నారు. లాభ నష్టాలను బేరీజు వేసుకోకుండా ప్రజలకు సేవలందించాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులు వ్యాపార దృష్టితో వైద్య సేవలు అందిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలో ఏవీఆర్ డెంటల్ ఆసుపత్రిని హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత గుర్తించి సేవలు అందించాలని అన్నారు. 2,500 మందికి ఉచితంగా గ్రహణ మొర్రి ఆపరేషన్లు చేసిన డాక్టర్ విజయ్‌ను ఈ సందర్భంగా అభినందించారు. సేవాభావంతో పేదలకు ఉచితంగా చికిత్స అందించిన విజయ్ హబ్సిగూడలో ఆసుపత్రి ప్రారంభించడంపై మంత్రి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎన్.వి.వి.ఎస్ ప్రభాకర్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




