Tuesday, 3 November 2026

కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలి

– ఆర్టీసీ భూములను లీజులపేరుతో దోచుకుంటున్నారు
– టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ
హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : ఆర్టీసీ కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో
మాట్లాడారు.. కార్మికుల విషయంలో గవర్నర్‌ని సైతం ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు.
వేలకోట్ల ఆర్టీసీ భూములను లీజుల పేరుతో టీఆర్‌ఎస్‌ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను మాట్లాడిన మాటలను కేసీఆర్‌ ఒకసారి గుర్తుచేసుకోవాలని హితవుచెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కేసీఆర్‌ ఎలాంటి విమర్శలు చేశారో నెమరు వేసుకోవాలన్నారు. ఆర్టీసీ కార్మికులపై పోలీసుల ప్రవర్తన దుర్మార్గంగా ఉందని రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు ఆర్టీసీ కార్మికుల కష్టాలు తెలియడం లేదా? అని ప్రశ్నించారు. కార్మికులు చేసే సమ్మె చట్ట విరుద్ధం అని హైకోర్టు చెప్పలేదని, కేసీఆర్‌ ప్రభుత్వం కార్మికులను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో బయోడైవర్సిటీ ప్లే ఓవర్‌ ప్రమాదంపైనా రమణ స్పందించారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించి ఆదుకోవాలన్నారు.