సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): కార్మికులపై రోజురోజుకు పెరుగుతున్న పనిభారాలను తగ్గించాలని, వేధింపులు ఆపాలని జనగాం డ్యూటీలు వరుసగా రెండు రోజులు రోజుకు 12 నుండి 14 గంటలు చేస్తే 3వ రోజు సెలవు ఇస్తామని డిపో అధికారుల ప్రతిపాదన,అమలును వెంటనే ఉపసంహరించుకోవాలని , నల్గొండ డీలక్స్ సర్వీసులు స్పెషల్ ఆఫ్ గా నడపాలని సూర్యాపేట ఆర్టీసీ డిపో జాయింట్ యాక్షన్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు కార్మికులతో కలిసి గేట్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జనగాం, ఖమ్మం తదితర డ్యూటీలను వరుసగా రెండు రోజులు రెండు డ్యూటీలు రోజుకు 14 గంటలు డ్యూటీలు చేస్తే 3వ రోజు సెలవు స్పెషల్ ఆఫ్ గా ఇస్తామని డ్యూటీ చార్ట్ వేశారని,ఈ ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్ కి అందించినట్లు తెలిపారు.అందరికి ఆమోదయోగ్యంగా ఉండే డ్యూటీ చార్ట్ వేస్తామని హామీ ఇచ్చిన డిపో అధికారులు.. నెల రోజుల తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అకస్మాత్తుగా నేటి నుండి జనగాం రూటులో అమలు చేస్తామనడం కార్మికులను నమ్మించి గొంతుకోయడమేనని అన్నారు.వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.కనీస అవసరాలకు సెలవు ఇవ్వకుండా వేధించడం తగదన్నారు.నెలలో 3 సెలవులు కచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.డిపో ఖర్చులను తగ్గించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని, కార్మికులను మానసిక శారీరక ఇబ్బందులకు గురిచేసి ఆనంద పడటం సబబు కాదన్నారు.చనిపోయిన బంధువుల ఫొటోలు పెడితే తప్ప సెలవు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. నల్గొండ డీలక్స్ సర్వీస్ లను స్పెషల్ ఆఫ్ సర్వీస్ లుగా నడపాలని కోరారు.యాజమాన్యం ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే నేటి నుండి మెరుపు సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సుంకరి శ్రీనివాస్ , అంజయ్య , బత్తుల సుధాకర్, పీఎం రావు, సేవ్యా , వెల్ఫేర్ సభ్యులు భాను నాయక్, శ్రీనివాస్ రెడ్డి, ఎర్ర వెంకన్న, తుల్లా రాములు,యాకస్వామి, డీఎస్ రావు, నరేష్ , ఎల్లయ్య, పర్శరాములు,గజ్జి శ్రీను , దామోదర్, సురేష్ , అద్దె బస్సు డ్రైవర్లు శ్రీనివాస్ రెడ్డి , వెంకన్న, మహిళా కార్మికులు ఎల్లమ్మ , యాకమ్మ , సైదమ్మ, మల్లికా, మంజుల, స్వరూప,శ్రీదేవి, కరుణ, బేగం, మంగమ్మ, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.




