
బెల్లంపల్లి, జులై 6, (జనంసాక్షి )
మాకొద్దీ ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయండి అంటూ డిమాండ్ చేస్తూ గురువారం బెల్లంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు పరుగెడుతూ క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తమను వేధింపులకు గురిచేస్తున్నాడని, ప్రతి చిన్న తప్పుకు చేయి చేసుకుంటున్నాడని ఆరోపించారు. విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడని, చాలా ఇబ్బందులు పెడుతున్నాడని, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేయడంతో క్యాంపు కార్యాలయం ప్రాంతం విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిపోయింది. విద్యార్థులు రోడ్డుపై బైటాయించడం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థులను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు బెల్లంపల్లి రూరల్ సీఐ రాజ్ కుమార్ గౌడ్ వచ్చి విద్యార్థుల సమస్య పరిష్కరిస్తామని, ఎంఈఓ మహేశ్వర్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎంఈఓ సంఘటన వచ్చి విద్యార్థులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఆందోళన విరమించిన విద్యార్థులు ర్యాలీగా తిరిగి గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. ఎంఈఓ మహేశ్వర్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడి పూర్తి విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా విద్యార్థులు ఆందోళన చేపట్టిన సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో లేరు. కాగా గతేడాది కూడా విద్యార్థులు ప్రిన్సిపాల్ వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టినప్పటికి ఇప్పటికి గురుకుల పాఠశాలలో తీరు మారలేదు. విద్యార్థుల ఆందోళనకు ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే. లేదా ప్రతి ఏడాది విద్యార్థులు ఇలా రోడ్డెక్కాల్సిందేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.




