Tuesday, 3 November 2026

కాళేశ్వరం ఆపేందుకు కాంగ్రెస్‌ కుట్ర

సింగరేణిని ముంచిన ఆ పార్టీ నేతలు
మహాకూటమిని నమ్మితే మన్నే: బాల్క
మందమర్రి,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా  కాళేశ్వరం ప్రాజెక్టును చేపడితే దానిని,ఆపడానికి మహాకూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారని, వారిమాటలను ప్రజలు నమ్మవద్దని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాల్క సుమన్‌ అన్నారు. వివిధ గ్రామాల్లో ఉదయం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన  నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరగా, వారికి గులాబీ కండువా ఆహ్వానించారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టులను అడ్డుకునేందుకు 40కిపైగా కేసులు వేసిన కుట్రదారులతో చేతులు కలిపి కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మధ్యంతరంలోనే ఆగిపోతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలందరూ పాలు పంచుకోవాలనీ, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే భవిష్యత్‌లో నియోజకవర్గం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అలాగే సింగరేణి కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.  సమస్యలను ఎన్నికల తర్వాత తాను దగ్గర ఉండి పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను నెరవేర్చిన కేసీఆర్‌దేనని  స్పష్టం చేశారుగతంలో సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో సింగరేణి సంస్థ నిర్వీర్యమైందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సింగరేణి సంస్థ అభివృద్ధిపథంలో ముందుకు సాగుతుందని వివరించారు. కార్మికులకు కారుణ్య నియామకాలు అమలు చేయించిన ఘనుడు కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇన్‌కంటాక్స్‌ను రద్దు చేయాలని పేర్కొంటూ అసెంబ్లీలో తీర్మాణం చేయించింది కేసీఆర్‌ అని గుర్తు చేశారు. ఆ తీర్మాణాన్ని కేంద్రం పక్కన బెట్టిందని వివరించారు.
సింగరేణికి బయ్యారంఉక్కు ఫ్యాక్ట రీ ఇచ్చే అంశం ప్రతిపాదనలో ఉందని తెలిపారు. సింగరేణి అభివృద్ధి కోసం నిరంతరం తపించే కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలని కోరారు.