జనంసాక్షి, మంథని : కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోతున్నాయని ఆందోళన చెందిన ఆరెంద,మల్లారం రైతులు సర్వే కోసం వెళ్లిన అధికారిని నిర్బంధించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆరెంద గ్రామపంచాయతీ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఏఈ వెంకన్నను మంగళవారం గ్రామస్తులు నిర్బంధించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో గ్రామానికి ముంపు రాకుండా కరకట్ట నిర్మిస్తానని చెప్పిన అధికారులు మాట తప్పారని, ఎన్నిసార్లు ఆందోళన చేపట్టినా ధర్నాలు, నిర్వహించినా, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో ఆరెంద, మల్లారంలో 382 ఎకరాలు నీటిలో మునిగిపోతున్నాయని, ఇప్పటివరకు ఎనిమిది పంటలు నష్టపోయినట్లు రైతులు వాపోయారు. పంట నష్టపరిహారం చెల్లింపు కోసం సర్వేకు వచ్చిన మంథని రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రివేణి తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఏఈ ని నిర్బంధించడానికి ప్రయత్నం చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్పించుకోగా ఏఈ వెంకన్న ను గ్రామస్తులు నిర్బంధించారు. ప్రతి సంవత్సరం మా భూములు ముంపునకు గురవుతూనే ఉంటాయని నష్టపరిహారంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం వెంటనే భూములు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.




