కేంద్రానిదో మాట..కిషన్ రెడ్డిదో మాట
మండిపడ్డ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేవలం రాజకీయం కోసమే ఆర్భాటపు ప్రకటను చేస్తున్నారని అన్నారు. ధాన్యం మద్దతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ట్రం నుంచి వరి ధాన్యాన్ని సేకరించమని ఈ ఏడాది సెప్టెంబర్ 17న రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కేంద్రం పరోక్షంగా సన్న వడ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వద్దని రాష్ట్రాలకు లేఖ రాస్తే.. అదే కేంద్ర మంత్రి ఎక్కువ ధర చెల్లించాలని డిమాండ్ చేయడం రెండు నాలుకల ధోరణి కాదా? అని మంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖను విూడియాకు మంత్రి విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులకు మద్దతు ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. సన్న రకాలకు ఎక్కువ ధర ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న కిషన్ రెడ్డి.. కేంద్రం రాసిన లేఖను వెనక్కి తీసుకునేలా ప్రయత్నించాలని సూచించారు. కేంద్రం లేఖ రాష్ట్రాలకు మెడ విూద కత్తిలా ఉందని ధ్వజమెత్తారు. ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించిన ధాన్యం సేకరమించమని ఎఫ్సీఐ తేల్చిచెప్పిందన్నారు. కేంద్రం తక్షణమే లేఖను ఉపసంహరించుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పండే ధాన్యం మన అవసరాల కన్నా మూడింతలు పండుతుంది. 87 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో పడింది. మన రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు మాత్రమే చాలు. మిగతా ధాన్యాన్ని ఏం చేయాలని హరీష్ రావు ప్రశ్నించారు.




