హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఉత్తర్వులు
తక్షన చర్యలకు డిజిపి, కలెక్టర్లు,ఎస్పీలకు ఆదేశాలు
హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో కూడా బాణాసంచా కాల్చాడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటాకులపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో రాష్ట్రంలో పటాకుల అమ్మకాలు, వినియోగాన్నినిషేధించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పటాకుల దుకాణాలు తక్షణమే మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో బాణాసంచా నిషేధించాలంటూ న్యాయవాది ఇందప్రకాశ్ పిల్ వేయడంతో షాపులను మూసివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే.. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ బాణాసంచా నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాల్చవద్దని హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలంటూ ప్రభుత్వం జీవో-1777 జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు,ప్రభుత్వం జీవోపై క్రాకర్స్ షాపు యజమానులు, అసోసియేషన్ సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టపాసులు బ్యాన్ చేస్తే కోట్లల్లో నష్టపోతామని.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారని క్రాకర్స్ షాపుల యాజమాన్యాలు చెబుతున్నాయి. మరోవైపు.. సుప్రీంకోర్టులో తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. బాణాసంచాను నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్‌లో అసోసియేషన్ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని క్రాకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. బాణాసంచాను నిషేధించాలని హైకోర్టులో న్యాయవాది ఇందప్రకాశ్ పిల్ వేయగా.. ఇప్పటి వరకు తెరిచిన బాణాసంచా షాపులను మూసివేయాలని గురువారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం బాణాసంచా నిషేధిస్తూ శుక్రవారం నాడు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక కోణంలో భాగంగా పండుగలు చాలా ముఖ్యమైనవని, కానీ ప్రజల ప్రాణాలు అంతకంటే ప్రధానమైనవని హైకోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పటాకులపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. పిటిషనర్ వాదనలు వినిపిస్తూ కొవిడ్ -19 వైరస్ రోగుల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని తెలిపారు. పటాకులు కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గి శ్వాసకోశ వ్యాధులున్న రోగులు, కొవిడ్ బాధితులు ఇబ్బందులు పడుతారని ధర్మాసనానికి నివేదించారు. ప్రజల ప్రాణాల రక్షణ దృష్ట్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. పటాకుల నిషేధంపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదని, కొవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు స్వీయ నియంత్రణలు పాటిస్తారని ఆశిస్తున్నదని తెలిపారు. పండుగల విషయంలో ఆంక్షలు విధించరాదన్న సదుద్దేశంతో ప్రభుత్వం జాగ్రత్తలు సూచించిందని తెలిపారు. ఇరువర్గాల వాదనలు నమోదుచేసుకొన్న ధర్మాసనం.. ప్రస్తుతం కొవిడ్ 19 మహమ్మారితో దేశం, రాష్ట్రం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది. పలు దేశాల్లో ఇప్పటికే సెకండ్‌వేవ్ ప్రారంభమైందని సంకేతాలు అందుతున్నాయని వ్యాఖ్యానించింది. పటాకుల వల్ల గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని, కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై తీవ్రంగా దాడి చేస్తుందని పేర్కొన్నది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత, అందుకోసం సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపింది. నియంత్రణ లేకుండా పటాకులు వినియోగించడం వల్ల కరోనా, శ్వాసకోస రోగుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పటాకుల అమ్మకంపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే తెరిచిన దుకాణాలను మూసేయాలని స్పష్టంచేసింది. ప్రజలు పటాకులు కాల్చకుండా ప్రింట్, ఎలక్టాన్రిక్ విూడియాల ద్వారా ప్రభుత్వం అవగాహన కల్పించాలని తెలిపింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై వివరణ సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.




