జనం సాక్షి మంథని : ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ, హత్య రాజకీయాలు చేస్తూ, ప్రజల మధ్య కుల మతాల చిచ్చు రేపే వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్ చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గొల్లపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంథని వరకు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు గ్రామ గ్రామానా ఘన స్వాగతం పలికారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడంతో, కర్ణాటక ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలుకుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. మంథని అంబేద్కర్ చౌరస్తాలో అర్ధరాత్రి ప్రజలను, కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబాన్ని అంతం చేస్తామని బిజెపి పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి బెదిరింపులకు దిగిన నేపథ్యంలో అక్కడ బిజెపి పార్టీని లేకుండా చేశారు.ఎక్కడైనా ప్రజల మనస్సు గెలుచుకున్న వాడే నిజమైన నాయకుడు అవుతాడని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంథని నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని , మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల ఆర్థిక,సామజిక అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో, అర్థం లేని పత్రికల్లో పిచ్చి పిచ్చి రాతలు రాస్తే, ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోవద్దని సూచించారు. తాను శ్రీధర్ బాబుగా ఏనాడూ శత్రువులకు సైతం అపకారం చేయలేదని , మంచే చేశానన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కలిసికట్టుగా పనిచేసి ఎలా విజయం సాధించామో అదేవిదంగా కార్యకర్తలు మనోధైర్యంతో కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, నిత్యం ప్రజల్లో ఉండి ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కుల మతాల మధ్య చిచ్చు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్తారు – కలిసికట్టుగా పనిచేస్తే కర్ణాటక తరహాలో తెలంగాణలో అధికారం సాధ్యం – ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు




