– స్కూటర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి
– ఎల్బీనగర్‌లో మెట్రో ఫిల్లర్‌ను ఢీకొట్టిన కారు
– ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
– వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న నగరవాసులు
హైదరాబాద్, నవంబర్27 (జనంసాక్షి) :
వరుస రోడ్డు ప్రమాదాలు భాగ్యనగరవాసులను భయపెడుతున్నాయి. గతవారంరోజుల నుంచి జరుగుతున్న ప్రమాదాలతో రోడ్లు విూదకు రావడానికే జనం బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం ఉదయం ఎల్బీ నగర్ సవిూపంలో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన కాసేపటికే కూకట్‌పల్లిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్కూటర్‌ను ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్బీనగర్- దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై అన్‌లిమిటెడ్ మాల్ దగ్గర ప్రమాదం కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అక్కడితో ఆగలేదు. ఆ వేగంతోనే కారు పల్టీలు కొట్టి.. మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది. కారు యాక్సిడెంట్ లో గాయపడిన మహిళలను ఓజోన్ ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ మహిళలను వెంకటమ్మ, సత్తెమ్మగా గుర్తించారు. వీరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కారు అతివేగంగా దూసుకురావడంతోనే యాక్సిడెంట్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు కూకట్‌పల్లిలోని వసంత్‌నగర్ సవిూపంలో వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్.. స్కూటర్‌ను కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్రంగా గాయపడిన స్కూటర్‌పై వ్యక్తి ఘటనా స్థలిలోనే ప్రాణాలొదిలాడు. మృతుడు అయ్యప్ప సొసైటీకి చెందిన సయ్యద్ కాసిం(25)గా గుర్తించారు. కాసిం ¬ండా యాక్టివాపై వెళుతుండగా వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టి, అతడిపై నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నారాయణ కాలేజీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం బంజారా హిల్స్‌లో ఆర్టీసీ బస్సు ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్‌ను పొట్టనబెట్టుకుంది. బస్సును తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 100 విూటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. బస్సు చక్రాలు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో ఛిద్రమైంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఐదు నిమిషాలకే ఆమెను ఆర్టీసీ రూపంలో మృత్యువు వెంబడించింది. అటు, బయోడైవర్సిటీ ప్లే ఓవర్ వద్ద వారం వ్యవధిలోనే రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేరొకరి నిర్లక్ష్యానికి ముగ్గురు బలయ్యారు. పైవంతెన అందుబాటులోకి వచ్చిన 20రోజుల్లోనే ముగ్గురు మృత్యువాతపడ్డారు. శనివారం జరిగిన ప్రమాదం హలీవుడ్ సినిమాను తలపించిందని ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్‌లు వెల్లడిస్తున్నాయి. ప్లేఓవర్‌పై నుంచి గాల్లో ఎగురుతూ కిందపడిన కారు చెట్టుపై పడి కూలడం.. అక్కడ మహిళ చనిపోవడం క్షణాల్లో జరిగింది. అతివేగంతోపాటు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఎదుటివారి మృతికి కారణమవుతున్నారు. ఇలా గతకొంతకాలంగా వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ప్రయాణీకులు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎటునుంచి మృత్యువు ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు.




