ముంబయి,నవంబరు19(జనం సాక్షి): ఓ యువతి తన ప్రియుడితో వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఆమెను తల్లి చంపేసింది. ఈ ఘటన సౌత్ ముంబయిలో ఆదివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పి. వాఘేలా(40) తన కుమార్తె నిర్మలా అశోక్ వాఘేలా(23)తో కలిసి ఉంటోంది. అయితే నిర్మల ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ప్రియుడితో బయటకు వెళ్లి బతికేందుకు బ్యాగ్ సర్దుకుంటుండగా.. నిర్మలను తల్లి అడ్డుకుంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత కుమార్తె మెడకు దుప్పట్ట చుట్టిన తల్లి చంపేసింది. అనంతరం తన కుమార్తెను తాను చంపానని పోలీసుల ఎదుట లొంగిపోయింది వాఘేలా. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




