Wednesday, 4 November 2026

కృష్ణవేణిలో అ’పూర్వ’ విద్యార్థుల సమ్మేళనం

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో 2020-2021 ఎస్ఎస్ సీ బ్యాచ్ విద్యార్థులు గెట్ టూ గెదర్ పార్టీని శనివారం ఘనంగా జరుపుకున్నారు. కరోనా సీజన్ లో ఎస్ఎస్సీ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ కోసం వివిధ ప్రాంతాల్లోని కళాశాలకు వెళ్ళిన విద్యార్థులంతా రెండేళ్ల తర్వాత పాఠశాలలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం హాజరై చదువు చెప్పిన గురువులను, తమ సహచరులను ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా మాట్లాడుకుని వ్యక్తిగత, కుటుంబాల యోగ క్షేమాలు తెలుసుకోవడంతో పాటు భవిష్యత్తు చదువుల గురించి చర్చించుకున్నారు. పాఠశాల విద్యలో తమ గత స్మృతులను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూల మాలలు, శాలువాలతో వైభవంగా సన్మానించారు. తమ బ్యాచ్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అనంతరం ఆడిపాడి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కేటీఎస్ స్కూల్ కరస్పాండెంట్ జాఫర్, డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.