Wednesday, 4 November 2026

విద్యార్ధుల భవిష్యత్‌కు సహకారం అందిస్తాం – వసతుల కల్పినకు అవసరమైన చర్యలు తీసుకోవాలి – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : విద్యార్ధుల భవిష్యత్‌ కోసం తనవంతు సహకారం అందిస్తానని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. గోదావరిఖని రమేష్‌నగర్‌లోని గుంజపడుగు మహాత్మా జ్యోతిబావు పూలే బాలికల రెసిడెన్సియల్‌ పాఠశాలను ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ప్రిన్సిపల్‌, అధికారులతో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.
రాబోయే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకో వాలన్నారు. ప్రభుత్వపరంగా అందించే నిధులతో పాటు తన స్వంతంగా కొంత ఆర్థికంగా సాయం అందిస్తామని ఆయన చెప్పారు. అంతేకాకుండా సింగరేణి సంస్థ సహకారంతో పాఠశాలలో సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్సియల్‌ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్దుల భవిష్యత్‌కు బంగారుబాటలు వేయాలని, ఇప్పటికే ప్రభుత్వం అనేక పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్దులకు ఉన్నత విద్యను అందిస్తోందన్నారు. ఈ క్రమంలో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తనవంతు సాయం అందిస్తామని ఆయన ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. పుట్ట మధు వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు తదితరులు ఉన్నారు