కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా మాటలు
బెదిరింపులుకు భయపడేది లేదు
సమస్యలకు పరిష్కారం ప్రగతిభవన్‌లో ఉంది
ఉద్యమనేత శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలి
విలీనం సహా ఏ సమస్యపైనా రాజీ లేదు: అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్,అక్టోబర్24(జనం సాక్షి): ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ ముగింపే సమాధానమని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ దురహంకారానికి పరాకాష్ట ఇదని విమర్శించారు. యూనియన్ల వల్లే ఆర్టీసీ ఇంకా బతికుందని అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీ కేసీఆర్ అయ్య జాగీరు కాదని, కార్మికుల కష్టం అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సీఎంలను చాలా మందిని చూశామని, సమ్మెపై వెనెక్కి తగ్గే ప్రసక్తే లేదని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. కార్మికులు అధైర్యపడొద్దని, మనదే అంతిమ విజయమని అశ్వత్థామ రెడ్డి పిలుపునిచ్చారు. సమస్యలకు పరిష్కారం ప్రగతి భవన్లోనే ఉందని అశ్వత్థామ రెడ్డి అన్నారు. అంతకుముందు ఆర్టీసీ మహిళ కార్మికుల నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ డిమాండ్‌ను విరమించుకోబోమని.. అన్ని పరిష్కరించాల్సిందే నన్నారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమ నాయకుడిగా కార్మికులకు మద్దతు తెలపాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వస్తామన్నారు. ట్యాక్సులు, పన్నులు రద్దు చేస్తే.. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తామన్నారు. ప్రజారవాణాపై ట్యాక్సులెందుకని ప్రశ్నించారు. హూజూర్ నగర్ ఎన్నికలో ఎట్ల గెలిచారో తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం అని చెబుతూ….ప్రజల హక్కులను అణిచి వేయడం చాలా బాధాకరమని పలువురు మహిళ సంఘాల నేతలు మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోని ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌లో ఆర్టీసీ మహిళ కండక్టర్లతో కలిసి పలు మహిళ సంఘాలు ధర్నాను చేపట్టాయి. ఈ ధర్నా కార్యక్రమానికి ఆయా సంఘాలకు చెందిన నేతలు పాల్గొని వారిక సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, మోత్కుపల్లి నర్సింహులు, విమలక్క తదితరులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను వాడుకొని ఇప్పుడు వదిలేశారన్నారు. ప్రస్తుత సమయంలో ఒక్కొక్కరు కాకుండా అందరు ఐక్యంగా కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను ఇంత దారుణంగా అణిచివేయడం దేశంలో ఎక్కడ చూడలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా తన నియంత పోకడలను వదలి ప్రజల సమస్యలను పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కెసిఆర్ ధోరణి అహంకారపూరితం




