Monday, 2 November 2026

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఖాయం

ఇచ్చి తీరుతానన్న సిఎం కెసిఆర్‌
హైదరాబాద్‌,అక్టోబర్‌24 (జనం సాక్షి):  తాను మాట ఇస్తే తప్పనని, ఇచ్చిన హావిూ మేరకు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు తప్పకుండా ఇస్తా ననిముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గురువారం విూడియా సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాల ప్రస్తావన రాగా ముఖ్యమంత్రి స్పందించారు. సుప్రీంకోర్టులో కేసు విషయం తేల్చడానికి భూపాల్‌రెడ్డిని ఢిల్లీకి పంపాను. కొద్దిరోజుల్లో సమస్యకు పరిష్కారం వస్తుంది. జర్నలిస్టులకు హైదరాబాద్‌లో మంచిస్థలం ఎంపిక చేసి ఇస్తాం. వారికి కడుపునిండే విధంగా వందశాతం జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చే బాధ్యత నాది. ఇళ్లస్థలాలే కాదు మంచి హౌసింగ్‌ స్కీమ్‌ ద్వారా ఇళ్లుకట్టుకునేందుకు అవసరమైన సాయం చేస్తా. దేశంలో మరెవ్వరూ ఇవ్వలేని విధంగా జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇస్తా. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు సరిగ్గా రాలేదు. కొందరు ఎడిటర్‌స్థాయి, మరికొందరు బ్యూరోచీఫ్‌లకూ స్థలాలు రాలేదు. కాబట్టి ఇప్పుడు అందరికీ ఇంటిస్థలాలతోపాటు ఇళ్లుకట్టుకునే విధంగా ప్రభుత్వం సాయం అందిస్తుది. నేను దిగిపోయేలోపు విూకు ఇళ్లస్థలాలు ఇస్తానని అన్నారు. వెంటనే కొందరు జర్నలిస్టులు పదేళ్లు అవుతుందా సార్‌…అంటూ ప్రశ్నించడంతో సీఎం కేసీఆర్‌ నవ్వుతూ అదేం లేదయ్యా మ్యాగ్జిమం ఒక సంవత్సరంలోనే జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు ఇస్తామన్నారు. అలాగే తమ ఎమ్మెల్యేలకూ ఇస్తామని సీఎం పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే వారి సంక్షేమానికి 100కోట్లు కేటాయించామన్నారు. మళ్లీ వచ్చే బ్జడెట్‌లో మరో వంద కోట్లు కేటాయిస్తామని సీఎం వెల్లడించారు.