– కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసేందుకు రావాలని అమిత్‌షా నుంచి ఫోన్
– కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లిన కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మే30(జనంసాక్షి) : కేంద్ర కేబినెట్లో తెలంగాణకు అవకాశం లభించింది. సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందిన బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాలని ఆహ్వానించారు. దీంతో కిషన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. దీంతో ప్రధానిగా రెండోసారి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం 7 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు క్యాబినెట్ కూడా ప్రమాణం చేయనుంది. అయితే మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై చర్చ జోరుగా నడుస్తోంది. ఈసారి తెలంగాణ నుంచి ఒకరికి బెర్తు ఖాయమైనట్టు ప్రచారం సాగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందిన కిషన్‌రెడ్డికి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కింది. కిషన్‌రెడ్డికి
మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నరేంద్రమోదీ, అమిత్ నిర్ణయించడంతో.. కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అంతేకాకుండా గురువారం ఉదయం అమిత్‌షా నేరుగా కిషన్‌రెడ్డికి ఫోన్‌చేసి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించడంతో కిషన్‌రెడ్డికి బెర్త్ ఖాయమైంది.
గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించిన బండారు దత్తాత్రేయ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండాలనే నిర్ణయంతో ఈసారి కిషన్‌రెడ్డికి అవకాశం కల్పించినట్లు పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. గతేడాది డిసెంబరులో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి అనూహ్య విజయం సాధించారు. బీజేపీ అధిష్ఠానం సైతం సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయను కాదని కిషన్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించింది. గతంలో తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషన్‌రెడ్డిని కేంద్ర క్యాబినెట్లోకి తీసుకోనుండటంతో ఆయన అభిమానులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి తొలిసారిగా 2004 శాసనసభ ఎన్నికల్లో హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అనంతరం 2009, 2014 ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ స్థానం గెలుపొందారు. కానీ 2018 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీచేసి ఓడిపోయారు.
కేంద్ర క్యాబినెట్లో కిషన్‌రెడ్డి




