హుజూర్ నగర్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి): కక్షిదారులు తమ కేసులను లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవడం ద్వారా వారి మధ్య ఉన్న శత్రుత్వ భావం తొలగిపోయి స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయని సీనియర్ సివిల్ జడ్జి జిట్టా శ్యాం కుమార్ అన్నారు. హుజూర్ నగర్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో కక్షిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సివిల్ వివాదాలు, కుటుంబ వివాదాలు మూలంగా క్షణికావేశంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ద్వారా చాలామంది కేసులలో ఇరుకుంటున్నారని ఆయన చెప్పారు. లోక్ అదాలత్ లో రాజీచేసుకున్న కేసులలో కోర్టుకు చెల్లించిన ఫీజును తిరిగి కక్షిదారులకు అందజేస్తామన్నారు. అలాగే సమయము, డబ్బు ఆదా అవుతుందన్నారు. జూనియర్ సివిల్ జడ్జి సాకేత్ మిత్ర మాట్లాడుతూ లోక్ అదాలత్ లో జారీ కాబడిన అవార్డుపై అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు. అట్టి అవార్డు శాశ్వతమైనదని భవిష్యత్ తరాలలో ఎప్పుడైనా సమస్య తిరిగి ఉత్పన్నమైతే ఇట్టి అవార్డును ఉపయోగించుకొని అవార్డును అమలు పరచవలసినదిగా కోరుతూ కోర్టును ఆశ్రయించవచ్చునన్నారు. లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా కోర్టులలో పేరుకుపోయిన పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించినట్లు అవుతుందన్నారు. బ్యాంకు అప్పులకు సంబంధించి లోక్ అదాలతో రాజీ చేసుకోవడం వల్ల బ్యాంకులకు చెల్లించవలసిన అప్పు నుండి రాయితీ పొందవచ్చును అన్నారు. కాగా ఈ లోక్ అదాలత్ లో 39 క్రిమినల్ కేసులు, 17 సివిల్ కేసులు, 1298 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రాజీ అయ్యాయి. బ్యాంకుకు చెల్లించవలసిన బాకీలలో 4లక్షల 47 వేలు రూపాయలను కక్షిదారులు వివిధ బ్యాంకులకు చెల్లించారు. అలాగే వివిధ కేసులలో జరిమానాల రూపంలో కక్షిదారులు 10 లక్షల 50 వేలు రూపాయలను చెల్లించగా అట్టి మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు కమతం నాగర్జున, కొట్టు సురేష్, దొంతి రెడ్డి నారాయణరెడ్డి, చనగాని మహేష్, న్యాయవాదులు కాల్వ శ్రీనివాసరావు, రవికుమార్, చల్లా కృష్ణయ్య, మీసాల అంజయ్య, చక్రాల వెంకటేశ్వర్లు, ఎం.ఎస్. రాఘవరావు, యాదగిరి, వట్టికూటి అంజయ్య, రామినేని వెంకటేశ్, నరేష్, లతీఫ్, వెంకట్ రెడ్డి, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, పసుపులేటి వీరయ్య, జక్కుల నవీన్, శ్రీను నాయక్, శంకర్ నాయక్, ఉదారి యాదగిరి, సీ.ఐ. రామలింగారెడ్డి, ఎస్సై వెంకటరెడ్డి, కోర్టు సిబ్బంది శ్యాం కుమార్, జానయ్య, ప్రశాంతి, శేఖర్, రేణుకయ్య, వివిధ బ్యాంకుల మేనేజర్లు, పారా లీగల్ వాలంటీర్స్ ఖాసిం, నాగలక్ష్మి, సాయమ్మ, లతా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




