కాకినాడ,నవంబర్13(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారని జడ్పీ ఛైర్మన్ నామన రాంబాబు అన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం, ప్రభుత్వంలో లోపాలు ఉంటే బయట పెట్టాల్సిన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి హాజరు కాకుండా ప్రజాస్వామ్యాన్ని మరోసారి అపహాస్యం చేశారన్నారు. రాష్ట్రంలో రాజకీయాల్ని జగన్ భ్రష్టు పట్టించారని, అడ్డదారిలో అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అతని అవినీతి రాజకీయాల్ని ఆదర్శంగా తీసుకుంటే యువత నష్టపోతారన్నారు. పనామా, వికీలీక్స్, ప్యారడైజ్ పేపర్లతో జగన్ అవినీతి వెలుగులోకొచ్చిందన్నారు. కోడికత్తి వ్వయహారం బెడిసి కొట్టిందన్నారు. వాటిపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. అవి కేవలం ఆరోపణలే అయితే ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. అతని అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతోందని, ట్యాక్స్‌కు సంబంధించి ఆయనపై సిబిఐ, సిబిడిటి విచారణ జరగాలన్నారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి, ప్రజల కోసం పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్ అవినీతి వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోందని పేర్కొన్నారు. కేసులు కాలయాపన చేయాలనే జగన్ పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. కేసులు తుది దశకు చేరుతున్నందున శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. దీంతో ఆయన కోర్టు హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకోవాలని పాదయాత్ర ప్రారంభించారన్నారు. ఆయన పాదయాత్రను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.




