– ప్రయోగాలతో రైతులకు మేలు
– సీఎం కేసీఆర్
– బాపూజీ పేరు పెట్టడం ముదావాహం
– కేంద్ర మంత్రి రాధామోహన్
హైదరాబాద్,జనవరి 7(జనంసాక్షి):ఏప్రిల్ 30న ఇంటింటికీ నల్లా పథకం ప్రారంభిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. వాటర్‌గ్రిడ్‌లో భాగంగా గజ్వెల్ నియోజకవర్గం నుంచే దీనిని ప్రారంభిస్తామని అన్నారు. గురువారం మెదక్ జిల్లా ములుగులో ఉద్యాన వర్శిటీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 1300 ఎకరాల్లో ఉద్యాన విశ్వవిద్యాలయం సహా మరో 2 సంస్థలు ఏర్పాటు సంతోషకరమన్నారు. దీంతో త్వరలోనే అద్భుతమైన ప్రయోగశాలలు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇది సాకారమైతే ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో మేలు చేకూర్చగలదని అన్నారు. అలాగే రూ.50కోట్లతో అటవీ కళాశాల ఏర్పాటు కాబోతున్నట్లు తెలిపారు. దక్షణభారత దేశంలో తమిళనాడు కోయంబత్తూరులో మాత్రమే ఇలాంటి కళాశాల ఉందన్నారు. ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్, అటవీ కళాశాలకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహనప్ సింగ్‌తో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ.. 1300 ఎకరాల్లో మూడు ఇనిస్టిట్యూట్స్ ప్రారంభించుకున్నందుకు గజ్వేల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్‌లో రూ.50 కోట్లతో అటవీ కళాశాల ఏర్పాటు కాబోతుంది. ఏప్రిల్ 30న ఇంటింటికి నల్లా పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఒంటిమామిడి మార్కెట్‌లో రూ.20 కోట్లతో కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాధామోహన్‌సింగ్‌తో మరోసారి సమావేశం అయి యూనివర్సిటీ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు. తెలంగాణ ప్రజల తరపున రాధామోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన సూచనలు పాటిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గోడౌన్ల కొరత ఉంది. గోడౌన్ల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో అతితక్కువ ఫారెస్ట్ కాలేజీలు ఉన్నాయి. హార్టికల్చర్ వర్సిటీ, రీసెర్చ్ సెంటర్ తెలంగాణ రాష్ట్రానికి విశిష్ట సేవలు అందిస్తుంది. త్వరలోనే అద్భుతమైన ప్రయోగశాలలు రాబోతున్నాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో విత్తనాల తయారీ జరుగుతోందని వివరించారు. తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం హర్షణీయమని కేంద్రమంత్రి రాధామోమన్ సింగ్ అన్నారు. లక్ష్మణ్ బాపూజీ తెలంగాణకు గాంధీ వంటివారు అని కొనియాడారు. దేశంలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశం సుభిక్షంగా ఉండాలంటే అన్నదాత బాగుండాలి. మోడీ ప్రధాని అయిన తరువాత రైతు సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారు. తక్కువ నీరు.. ఎక్కువ సాగు నినాదం తీసుకువచ్చామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన పనిని చేసి చూపుతున్నామని అన్నారు. వ్యవసాయాభివృద్దికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని అన్నారు. గత పదేళ్లలో రైతులను ఆదుకునేవారే కరువయ్యారు. రైతుల కోసం భూసార పరీక్ష కార్డులు ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ-మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు మేలు కలుగుతుందన్నారు. దేశమంతటా ఒకే మార్కెటింగ్ విధానం ఉండేలా కృషి చేస్తామన్నారు. దళారీ వ్యవస్థ వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. అన్ని పంటలకు తెలంగాణలో వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ…కేంద్ర త్వరగా యూనివర్సిటీ నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని
విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి ఎక్కువగా ఉంది. కరువు సాయంపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హార్టికల్చర్ యూనివర్సిటీని రూ.1823 కోట్లతో నిర్మించబోతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం తెలంగాణకు హార్టికల్చర్ యూనివర్సిటీని మంజూరు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ మంత్రులు హరీష్ రావు,జోగురామన్న, డిప్యూటి స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి సహా అందరికి సిఎం కెసిఆర్ జ్ఞాపికలు బహుకరించారు.





