హైదరాబాద్,డిసెంబర్ 1,(జనంసాక్షి): తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగకల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు మద్దతునివ్వాలని కోరుతూ జేఏసీ చైర్మన్ కోదండరాం శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను వేరువేరుగా కలిశారు. తొలుత బీజేపి కార్యాలయంకు వెళ్లిన కోదండరాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కొలువులు కొట్లాట సభకు మద్దతు ప్రకటించాలని, తద్వారా ప్రభుత్వం తీరును ఎండగట్టాలని కోరారు. సభలో పాల్గొని ప్రభుత్వం తీరును ప్రజలకు తెలియజేయాలని లక్ష్మణ్‌ను కోదండరాం కోరారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ.. కొలువులకై కొట్లాట సభకు లక్ష్మణ్ కూడా హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్‌లో సభలు నిర్వహించాలంటే చాలా ఇబ్బందిపడాల్సి వస్తోందని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్భంధ వాతావరణం ఉందని పేర్కొన్నారు. సభలో యువత, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఉత్తమ్-కోదండరాం మధ్య ఆసక్తికర చర్చ
కొలువుల కొట్లాట సభకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కోరారు. గాంధీభవన్‌కు వెళ్లిన కోదండరాం ఉత్తమ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సభలో పాల్గొనాలని, తద్వారా ప్రభుత్వం తీరును ఎండగట్టాలని కోరారు. అయితే ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుందని, కొలువుల కొట్లాట సభకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ఉత్తమ్ అన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. రాజకీయంగా కాంగ్రెస్‌కు… టీజేఏసీ మద్దతు ఇవ్వాలని ఉత్తమ్ కోదండరాంను కోరారు. ‘సమస్యలపై విూరు బాగా పోరాడుతున్నారు… విూరు ఊహించిన ఆకాంక్షలు నెరవేరడం కోసం కాంగ్రెస్‌కు మద్దతివ్వండి’ అని ఉత్తమ్ అన్నారు. అయితే దీనికి సమాధానంగా.. జేఏసీ రాజకీయ పార్టీ కాదని కోదండరాం అన్నారు.




