Wednesday, 4 November 2026

కొత్త సీసాలో పాత సారా లాగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అని మండిపడ్డ అతహర్.

 

 

 

 

 

భువనగిరి టౌన్ (జనం సాక్షి):–తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడి ల ఉందని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ బడ్జెట్ పత్రాలను చింపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున భువనగిరి జిల్లా కేంద్రం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతహర్ మాట్లాడుతూ సోమవారం రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన 2,90,396 కోట్ల బడ్జెట్ సామాన్య ప్రజల నడ్డి విరిచే విధంగా ఉందని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పేద ప్రజలకు ఇవ్వవలసిన విద్య, వైద్యం కొరకు మొత్తం బడ్జెట్ లో కేవలం 10 శాతం కేటాయంచకపోవడం కేసీఆర్ ప్రభుత్వం విద్యావ్వవస్థను తొంగలోకి తొక్కే ప్రయత్నమేనని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గం యొక్క సంక్షేమం కొరకు 2 శాతం బడ్జెట్ కేటాయించి అన్యాయం చేశారని మైనారిటీ లకు కేవలం 2 వేల కోట్లు కేటాయించి మొండి చెయ్యి చూపారని వాపోయారు. ఎస్సి, ఎస్టీ లను కించపరిచే విధంగా బడ్జెట్ రూపొందించారని దళిత బందు కు కేటాయించిన బడ్జెట్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల అకౌంట్ లలోకే పోతుందని అన్నారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు ఒక్క పైసా కూడా కేటాయంచక పోవడం బాధకరమని సొంత జాగా ఉన్న వాళ్లకి నియోజకవర్గం లో 2 వేల మంది కి 3 లక్షల చొప్పున ఇచ్చే పథకం కూడా కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే ఇస్తారని వాపోయారు.కేసీఆర్ ప్రభుత్వానికి కమిషన్ లు వచ్చే శాఖలకే ఎక్కువ బడ్జెట్ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమైనా వారి ఇంట్లో నుండి ఇస్తున్నారా అని ప్రశ్నించారు. పేద ప్రజలు చెమటోడ్చి సంపాదించిన డబ్బులు పన్నులు రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే తిరిగి దానినే బడ్జెట్ రూపం లో ప్రవేశపెట్టి అదే పేద ప్రజలకు అన్యాయం చేశారని అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ నిరంకుశ పాలనను వదిలి పేద ప్రజల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు సాయి నివాస్, యూత్ కార్యదర్శి రాకేష్, మైనారిటీ ప్రధాన కార్యదర్శి సోహైల్ నాయకులు రేవంత్, నితిన్, వెంకట్, వసీమ్ తదితరులు పాల్గొన్నారు.