– 12రోజుకు చేరిన సంగీత దీక్ష
– న్యాయం జరిగేవరకు దీక్షవిరమించనంటున్న సంగీత
హైదరాబాద్, నవంబర్30(జనంసాక్షి) : భర్త చేతిలో మోసపోయి తనకు న్యాయం చేయాలంటూ అత్తింటి ముందు సంగీత చేస్తున్న దీక్ష 12వ రోజుకి చేరుకుంది. తన రెండేళ్ల పాపతో భర్త ఇంటి ముందే నిరసన కొనసాగిస్తోంది. భర్తతో పాటు ఆమె అత్తమామల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన తనకు న్యాయం జరుగదని, తనను కోడలిగా అంగీకరించాలని డిమాండ్ చేస్తోంది. కాగా సంగీత కేసులో పోలీసులు చట్టపరంగా చేయాల్సిందంతా చేశారు. ఇప్పటికే ఆమె భర్త, అత్తమామల్ని అరెస్ట్ చేశారు. సంగీత ఇష్యూలో మరో కొత్త కోణం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అమె తన భర్త నుంచి రూ.3కోట్లు భరణం డిమాండ్ చేస్తోందని తమకు తెలిసినట్లు రాచకొండ కవిూషనర్ మహేష్ భగవత్ చెప్పారు. అయితే అది తప్పుడు ప్రచారమని, తన పోరాటం డబ్బుకోసం కాదని, న్యాయం కోసమని సంగీత స్పష్టం చేసింది. అటు సంగీతకు మహిళ సంఘాలతో పాటు ప్రజాసంఘాలు, న్యాయ నిపుణుల నుంచి కూడా మద్దతు దక్కింది. భర్తతో ఉండాలా వద్దా.. సంగీత ఇష్టమని రిటైర్డ్ జడ్జీ చంద్రకుమార్ అభిప్రాయపడ్డారు. కలిసి ఉండే ఉద్దేశ్యం లేకపోతే భరణం పొందే హక్కు ఉందని అన్నారు. కాగా సంగీతను పరామర్శించిన తెలంగాణ ప్రజాసంఘాల నేత విమలక్క శ్రీనివాస్ రెడ్డిపై కేసులు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాధితురాలి న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. ఇందులో భాగంగా చర్లపల్లి జైలులో ఉన్న సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డిని ఆయన కలిశారు. అక్కడి నుంచి వచ్చి సంగీతను కలిసిన ఎంపీ, అక్కడ తన భర్త చెప్పిన విషయాలు సంగీతకు వివరించారు. దీక్ష విరమించాలని, తనకు ఎటువంటి సమస్య రాకుండా చూసుకుంటానని హావిూ ఇచ్చారు. ఆస్తులన్నీ సంగీత మామ పేరిట ఉన్నాయని, అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే తనకు న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని సంగీత స్పష్టం చేసింది. అయితే రాజకీయ నేతల చర్చలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఆమె న్యాయపోరాటం ఉదృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొనసాగుతున్న సంగీత న్యాయపోరాటం




