Wednesday, 4 November 2026

కోడికత్తి వ్యవహారాన్ని మర్చిపోండి

 

పార్టీ నేతలకు బాబు హితవు

అమరావతి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఉచ్చులో పడొద్దని తెదేపా నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్లు ఐదు రోజులుగా జగన్‌ కోడికత్తి దాడి వ్యవహారంపై చర్చ నడుస్తోందన్నారు. కడప జిల్లా పర్యటనకు వెళ్లే ముందు పార్టీ నేతలతో ఆయన మాట్లాడారు. కోడికత్తి ఘటనపై అంత తీవ్రంగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై ఇక స్పందించకుండా ఉంటే మంచిదని సూచించారు. కావాలనే దీనిపై వైకాపా నేతలు రచ్కచ చేస్తున్నారని అన్నారు. వారికి వేరే సమస్యలు పట్టవు గనక దీనిపై అదేపనిగా ప్రచారం కోసం చూస్తున్నారని అన్నారు.

తిత్లీ తుపాను బాధితులకు త్వరలోనే చెక్కులు పంపిణీ చేయనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని నేతలకు సీఎం దిశానిర్దేశర చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి వ్యవహారంపై గత కొద్దిరోజులుగా అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని వైకాపా నేతలు విమర్శిస్తుండగా.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విమానాశ్రయంలో ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధమేంటని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఈ ఘటనకు అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు.

టిడిపి ప్రభుత్వాన్ని అస్థిర పరచే కుట్ర

ఇదిలావుంటే రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కోడికత్తి డ్రామాకు కొనసాగింపుగా అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కోడికత్తిని తీసుకెళ్లిన దొంగకు, బొత్సకు ఉన్న సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైందని జూపూడి ఎద్దేవా చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ బీజేపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని జూపూడి విమర్శించారు. ఏపీ డీజీపీకి ఫోన్‌ చేయడాన్ని గవర్నర్‌ ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి రాజ్‌భవన్‌ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని, మోదీ, అమిత్‌షా నుంచి దేశాన్ని రక్షించేందుకు చంద్రబాబు నడుం బిగించారని జూపూడి ప్రభాకరరావు అన్నారు.