Tuesday, 3 November 2026

కౌలురైతు బంధు పథకం కాదు- సిఎం కేసిఆర్‌

హైదరాబాద్‌(జ‌నం సాక్షి): రైతులకు పంట పెట్టుబడి ఇవ్వ డం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు అనే పథకం అమలు చేస్తున్నది తప్ప.. కౌలురైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇది రైతుబంధు పథకమే తప్ప.. కౌలురైతు బంధు పథకం కాదని ఆయన తేల్చిచెప్పారు. సమాజంలో అనేకరకాల ఆస్తులను ఇతరులకు కొద్దికాలం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు హక్కుదారులు కారని సిఎం పేర్కొన్నారు. ఇతరులెవరికీ లేని నిబంధన కేవలం రైతులకే ఎందుకుం డాలని, రైతులను ఎందుకు ఇబ్బంది పెట్టాలని కేసిఆర్‌ ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని కౌలురైతులకు వర్తింపచేయాలని డిమాండ్‌ అర్థ రహితమైనదని, ఆవాదన న్యాయసమ్మతం కాదని సిఎం వెల్లడించారు.రైతుబంధు పథకం అమలుపై సిఎం కేసిఆర్‌ ప్రగతిభవన్‌లో శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె. జోషి, ముఖ్యకార్య దర్శులు ఎస్‌. నర్సింగ్‌రావు, రాజేశ్వర్‌ తివారి, పార్థసారధి, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాంచం దర్‌రావు, వ్యవసాయ శాఖ కమషనర్‌ జగన్‌ మోహన్‌, సిఎంఓ కార్య దర్శులు స్మితా సభర్వాల్‌, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఎకరానికి ఏడాదికి 8 వేల చొప్పున పంట పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం రైతుబంధు పథకం అమలు చేస్తున్నదని సిఎం కేసిఆర్‌ తెలిపారు.ఎలాంటి వివక్ష లేకుండా రైతులందరికీ ఈ పథకం వర్తిస్తున్నదని, ఈపథకం కేవలం రైతులకు ఉద్దేశించి తప్ప, కౌలు రైతులకు సంబంధించింది కాదన్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందన్నారు. బడ్జెట్లో ఈపథకం అమలు చేయడానికి 12 వేల కోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఈబడ్జెట్‌ను ఆమోదించిందన్నారు.