టేకులపల్లి, మే 5( జనం సాక్షి): మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో స్థానిక వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైధ్యాధికారి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు అనుమానాస్పద రొమ్ము క్యాన్సర్, గొంతు క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ తదితర క్యాన్సర్ రోగులను సకాలంలో గుర్తించడానికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలనిఅన్నారు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించిన అనుమానితులను నిర్ధారణ పరీక్షల కొరకు జి జి హెచ్ కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో గల రేడియాలజీ విభాగంలో ఉచితంగా చేసే ఖరీదైన నిర్ధారణ పరీక్ష కొరకు పంపించాలని, తద్వారా రోగి జీవిత కాలాన్ని గణనీయంగా పెంచవచ్చని ఈ సందర్భంగా సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తల్లి పిల్లల సంరక్షణ సేవలు, సరియైన సమయంలో వ్యాధినిరోధక టీకాలు, వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దోమల నివారణ కొరకు తీసుకునే చర్యలు,రాపిడ్ ఫీవర్ సర్వే, గర్భిణీ స్త్రీలలో కనపడే ప్రమాద సూచికలు నివారణ, రక్తహీనత, బాల్యవివాహాల వల్ల నష్టాలు సరైన వయసులో వివాహం వల్ల ఉపయోగాలు, తదితర అంశాలపై శిక్షణను ఇచ్చారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల వైద్య సేవలపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో జరిగిన నెలవారి టెలికాన్ఫరెన్స్ సమీక్షలో వైద్యాధికారితోపాటు పల్లె ధవాఖాన వైద్యాధికారులు ధరణి, హారిక,శైలజ,అమూల్య, నికిత, భార్గవి,సూపర్వైజర్లు నాగు బండి వెంకటేశ్వర్లు, గుజ్జ విజయ, వీసం శకుంతల, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




